ప్రైవేట్ స్కూల్ బస్సు ఓవర్‌స్పీడ్‌పై గ్రామస్తుల ఆగ్రహం ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఎడవల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాల బస్సు వేగంగా రావడంతో ఎదురుగా వస్తున్న ఎద్దుల బండి అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎద్దుల బండిపై ఉన్న రైతు ప్రమాదాన్ని గమనించి బండి నుంచి దూకడంతో పెను ప్రమాదం తప్పింది. ఎద్దుల బండి బోల్తా పడినప్పటికీ బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు బస్సును గ్రామంలో నిలిపివేసి డ్రైవర్‌ను ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యం ఎక్కువ ట్రిప్పులు తిరగాలని ఒత్తిడి చేయడంతో వేగంగా వెళ్లాల్సి వస్తోందని డ్రైవర్ తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. దీంతో బస్సును గ్రామంలోనే నిలిపివేసిన గ్రామస్తులు పాఠశాల యాజమాన్యం గ్రామానికి వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాల వాహనాలపై, డ్రైవర్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు