Kaizer News

Congress candidate arrested | మమతా బెనర్జీ మద్దతు

Congress candidate arrested | మమతా బెనర్జీ మద్దతు తర్వాత.. కాంగ్రెస్ నందిగ్రామ్ అభ్యర్థి అరెస్ట్‌

· National - India · ntnews.com

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు తమ వర్గం మద్దతు ఇస్తుందని మాజీ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటల్లోనే పాత కేసులో కాంగ్రెస్‌ అభ్యర్థిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. (Congress candidate arrested) 2007లో నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక నిరసనల సమయంలో జరిగిన ఒక హత్య కేసుకు సంబంధించి మిలన్‌ ప్రధాన్‌ను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తున్నది. కాగా, అక్టోబర్‌ 6న జరుగనున్న నందిగ్రామ్‌ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు తొలుత వెల్లువెత్తాయి. అయితే ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం ఆరోపణలకు సంబంధించి 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేయడంతో ఉద్యోగాన్ని కోల్పోయిన నందిగ్రామ్‌కు చెందిన ఉపాధ్యాయురాలు సంచితా ప్రధాన్ డేను తమ అభ్యర్థిగా మమతా నేతృత్వంలోని టీఎంసీ వర్గం ప్రకటించింది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న నందిగ్రామ్ స్థానం నుంచి పోటీకి దిగిన ఆ అభ్యర్థిని షాక్‌ ఇచ్చారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశమైన తర్వాత తన అభ్యర్థిత్వాన్ని సంచితా ప్రధాన్ డే ఉపసంహరించుకున్నారు. మరోవైపు మమతా బెనర్జీ శుక్రవారం దీనిపై స్పందించారు. నందిగ్రామ్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు తన మద్దతును ప్రకటించారు. నందిగ్రామ్ నుంచి తమ వర్గం తరుఫున మరో అభ్యర్థిని నిలబెట్టబోమని మమతా బెనర్జీ తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. భారతదేశం నుంచి బీజేపీ వెళ్లిపోవాలని నేను కోరుకుంటున్నా. మా పూర్తి సంఘీభావం ఇండియా కూటమికే. ఇండియా కూటమిని బలోపేతం చేసే సందేశం బెంగాల్ నుంచే మొదలవ్వాలి’ అని మీడియాతో అన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం తనకు ఫోన్ చేశారని, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇండియా కూటమికి మద్దతు సందేశాన్ని పోస్ట్ చేసినట్లు మమతా బెనర్జీ వివరించారు. అయితే కాంగ్రెస్‌కు ఆమె మద్దతు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆ పార్టీ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను పాత కేసులో పోలీసులు అరెస్ట్‌ చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది

Original source: ntnews.com
Read more on Kaizer News