ఏ ఇద్దరు మనుషులైనా తమ డీఎన్‌ఏలో 99.6 శాతాన్ని పంచు కుంటారు. మరో మనిషిపై సానుభూతిని నిరాకరించడం అంటే, తార్కికంగా చూస్తే, మనలోని 0.4 శాతం తేడాను ద్వేషించడమే. మనం ప్రత్యేకతను ఆరాధించే యుగంలో జీవిస్తున్నాం. ఇతరులకంటే మనం ఎలాభిన్నంగా ఉన్నామో చాటిచెప్పాలని ఆధునిక సంస్కృతి మనకు చెబుతోంది. అయితే, వ్యక్తిగత సామీప్యత అనే పరిమితిని పక్కనపెట్టి, మానవాళి మొత్తానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పరిశీలిస్తే పూర్తిగా భిన్నమైన చిత్రం ఆవిష్కృతమవుతుంది. మనం ఒకరినొకరం వేర్వేరు శిబిరాలుగా విభజించుకోవడానికి, పరస్పరం తగాదాలు పడటానికి కారణ మవుతున్న తేడాలు చాలావరకు మన వ్యక్తిగత అనుభవాల వల్ల ఏర్పడే భ్రమలే. ఆ వ్యక్తిగత సామీప్యతను శాస్త్రీయ, గణిత విశ్లేషణల ద్వారా పక్కకు తొల గిస్తే, ఈ భూమిపై ఉన్న 830 కోట్ల మంది అంతులేని వైవిధ్య సమూహంగా కనిపించరు. విశ్వవ్యాప్త మానవ స్వభావాన్ని ప్రతిబింబించే ఒకే ఒకసాంద్రమైన శిఖరానికి మనమంతా అత్యంత సమీపంగా ముడిపడి ఉన్నామని స్పష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఎత్తు, చర్మపు రంగులు, స్వభావాల్లో కనిపించే వైవిధ్యాన్ని చూసి, మనుషుల మధ్య లోతైన భేదాలు ఉన్నాయని భావించడం సహజం. కానీ జన్యుశాస్త్రం దీనికి మరింత భిన్నమైన కథను చెబుతోంది. ఆధునిక జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రకారం, భూమిపై ఉన్న ఏ ఇద్దరు మనుషుల జన్యు నిర్మాణమైనా సుమారు 99.6% నుంచి 99.9% వరకు ఒకేలా ఉంటుంది. మనలో కనిపించే ప్రతి శారీరక వైవిధ్యానికీ కారణం ఈ అత్యంత స్వల్పమైన తేడానే. మన మానసిక స్థితి, ప్రేరణలను నియంత్రించే న్యూరో ట్రాన్స్‌మిటర్లు, ఒత్తిడికి శరీరం స్పందించే విధానం, సామాజిక అనుబంధాలను నియంత్రించే హార్మోన్లకు సంబంధించిన జీవరసాయన రూపకల్పన మొత్తం మానవజాతిలో దాదాపు ఒకే విధంగా ఉంటుంది. సార్వత్రిక గ్రామం– సంస్థాగత సమన్వయం పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది కుటుంబంతో పాటు ఒక సామూహిక శక్తి– సామాజిక గ్రామం. శైశవం నుంచి యుక్తవయస్సు వరకు ప్రతి బిడ్డపై ప్రభావం చూపే అంశాల సమగ్ర వ్యవస్థను పరిశీలిస్తే, కుటుంబ, సామాజిక వలయం, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇంటర్నెట్, టెలి విజన్ సినిమాలు, ప్రపంచ వ్యాప్త మీడియా వంటి వ్యవస్థలు కనిపి స్తాయి. ఇవి సాంస్కృతిక సరి హద్దులు, కాలమాన ప్రాంతాలను దాటి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. ఒక పిల్లవాడు లాస్ ఏంజెలిస్‌లో పెరిగినా, ముంబైలో పెరిగినా, సహకారం, పరస్పర సహకారం, నిజాయితీ, పట్టుదల, దూకుడును నియంత్రించుకోవడం వంటి ప్రాథమిక ప్రవర్తనలకు ఒకే విధమైన ప్రోత్సాహం, నిరుత్సాహం కలిగించే సంస్థాగత వ్యవస్థల గుండా ప్రయా ణిస్తుంది. పైకి కనిపించే సాంస్కృతిక భేదాలు నిజమే. కానీ వాటి అంత ర్లీన ప్రవర్తనా శిక్షణ మాత్రం ఒకే దిశగా పయనిస్తుంది. 830 కోట్ల మంది వ్యక్తులు సమష్టిగా చూస్తే, ప్రాథమికంగా ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉన్నారని గణాంకపరంగా ఎలా నిరూపించగలం? ఇందుకోసం ఒక ప్రపంచవ్యాప్త ఆలోచనా ప్రయోగాన్ని ఊహించు కుందాం. వేలాది మంది పాల్గొనేవారిని, తమకు బాగా పరిచయమున్న 100 మంది వ్యక్తుల పేర్లను చెప్పమని అడుగుదాం. ఆ తర్వాత ప్రతి వ్యక్తి స్వభావాన్ని 1 నుంచి 10 వరకు ఒక ప్రమాణంపై అంచనా వేయమని కోరుదాం. అ