Shorts కర్నూలు: కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ అభివృద్ధి, రూపాంతరంపై రాష్ట్ర సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి (విద్య), రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. నగరంలోని వినాయక ఘాట్ వద్ద గత నాలుగు నెలలుగా చేపట్టిన పారిశుద్ధ్య, అభివృద్ధి పనులకు సంబంధించిన వీడియోను కర్నూలు నగరపాలక సంస్థ ప్రత్యేకంగా రూపొందించి శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఈ వీడియోను శనివారం మంత్రి నారా లోకేష్ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికల్లో రీ-అప్‌లోడ్ చేసి, మంత్రి టీజీ భరత్, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, కమిషనర్ చల్లా ఓబులేసుతో పాటు అధికార యంత్రాంగాన్ని అభినందించారు. చెత్తతో నిండిన ప్రాంతం నుంచి పరిశుభ్రమైన, అందమైన, అభివృద్ధి చెందిన వినాయక ఘాట్‌గా మారడం అభినందనీయమని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. కేంద్రీకృత పాలన, ప్రాథమిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఎలాంటి మార్పు సాధ్యమవుతుందో కర్నూలు వినాయక ఘాట్ రూపాంతరం చూపిస్తోందన్నారు. ఈ మార్పు కోసం కృషి చేసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో పాటు మొత్తం అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. రాజకీయ నాయకత్వం స్థానిక పరిపాలనా యంత్రాంగంతో కలిసి పనిచేస్తే అద్భుతమైన మార్పులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. పరిశుభ్రంగా మారిన ప్రజా ప్రదేశాలను ఇకపై కూడా పరిశుభ్రంగానే ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఈ అందమైన మార్పును కాపాడుకోవడంలో ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కాగా, నాలుగు నెలల క్రితం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన చల్లా ఓబులేసు తొలుత జేసీబీలతో పెద్ద ఎత్తున చెత్తాచెదారాన్ని తొలగింపజేశారు. అనంతరం ఘాట్ వద్ద సీసీ రహదారి, మెట్లు, బండ్, డ్రెయిన్, రాతి నిర్మాణాలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారు. కేసీ కెనాల్‌లో పేరుకుపోయిన గుర్రపుడెక్క మొక్కలను తొలగింపజేయడంతో పాటు ఘాట్ పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. కెనాల్‌లో చెత్త వేయకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, చెత్త సేకరణ ట్రాలీలను అందుబాటులో ఉంచారు. దీంతో గతంలో చెత్తాచెదారంతో నిండిపోయిన ప్రాంతం ప్రస్తుతం పరిశుభ్రంగా, సుందరంగా రూపాంతరం చెందింది. ఈ మార్పులకు సంబంధించిన ప్రత్యేక వీడియోను కర్నూలు నగరపాలక సంస్థ రూపొందించి శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా, శనివారం మంత్రి నారా లోకేష్ ఆ వీడియోను తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో రీ-అప్‌లోడ్ చేసి అభినందించడం విశేషం