Mumbai : మహారాష్ట్రలోని ముంబైలో ఘోర్ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి. ఈ ఘటన ముంబై, కోస్టల్ రోడ్, లాలాలజపతిరాయ్ ఎదురుగా ఉన్న లాలా కాలేజ్ వద్ద ఆదివారం వేకువఝామున 5.20 గంటలకు జరిగింది. నలుగురు ప్రయాణికులతో కూడిన ఒక బీఎండబ్ల్యూ కార్ మెరైన్ డ్రైవ్ ప్రాంతం నుంచి హజి అలీ ప్రాంతాని వెళ్తుండగా.. అతివేగం కారణంగా అదుపుతప్పింది. దీంతో బ్రిడ్జిపై నుంచి 70 అడుగుల కింద ఉన్న స్థలంలో పడిపోయింది. అది కూడా కారు అతివేగంగా పడటం వల్ల కారులోని నలుగురిలో ముగ్గురు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఘటనా స్థలంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా ముగ్గురు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆదిత్య కల్పేశ్వర్ ఓస్వాల్ (23) అనే వ్యక్తి చికిత్స పొందుతుండగా అతడి పరిస్థితి విషమంగా ఉంది. మరణించిన వారిని షనయ్ గజ్జల్ (21), ధైర్య దర్శన్ షేత్ (17), ఆదిత్య జకాసనియా (23)గా గుర్తించారు. వీరి మృతదేహాల్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు