రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఏళ్ల తరబడి కొనసాగిన భూసమస్యకు పరిష్కారం.. నూతన్‌కల్, మద్దిరాల రైతులకు న్యాయం సూర్యాపేట, ఆంధ్రప్రభ : ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్న రాష్ట్రంలోనూ దశాబ్దకాలం పాటు రైతుల భూసమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన భూములు ఉన్నప్పటికీ, సరైన పత్రాలు లేక తరతరాలుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు న్యాయం చేయడమే ప్రభుత్వ బాధ్యతగా భావించామని చెప్పారు. సూర్యాపేట జిల్లా నూతన్‌కల్, మద్దిరాల మండలాలకు చెందిన రైతులు తనను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన భూమి అవసరాల సమయంలో ఉపయోగపడకపోవడం, కష్టకాలంలో అండగా నిలవాల్సిన ఆస్తే తమకు కష్టాలు తెచ్చిపెడుతోందని రైతులు వాపోయారని తెలిపారు. ఆ సమయంలో ఏడాది లోపే సమస్యను పరిష్కరిస్తానని రైతులకు మాట ఇచ్చానని, ఆ మాట ప్రకారమే సంవత్సరం పూర్తికాకముందే సమస్యకు పరిష్కారం చూపామని మంత్రి పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు విస్తృతంగా సర్వే నిర్వహించి ప్రతి అంశాన్ని పరిశీలించిన అనంతరం న్యాయబద్ధమైన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించే ప్రక్రియను పూర్తి చేశారని చెప్పారు. రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందో ఈ చర్య నిదర్శనమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నూతన్‌కల్, మద్దిరాల మండలాల రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతుల ఆస్తులకు భద్రత కల్పించి, వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు