శంకర్‌పల్లి, ఆంధ్రప్రభ: శంకర్‌పల్లి మండల కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల గైర్హాజరుతో మొక్కుబడిగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజావాణి కార్యక్రమం సమయానికే ప్రారంభమైనప్పటికీ, 11 గంటల సమయానికి కూడా అన్ని విభాగాలకు చెందిన అధికారులు పూర్తిస్థాయిలో హాజరుకాలేదని పలువురు పేర్కొన్నారు. దీంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి కొందరు అధికారులు సమయపాలన పాటించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు కొంతమంది అధికారులు హాజరు పట్టికలో సంతకాలు చేసి కార్యాలయం వెలుపల కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఉద్దేశం దెబ్బతినకుండా అన్ని విభాగాల అధికారులు బాధ్యతాయుతంగా, సమయానికి హాజరయ్యేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు