శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు.. నందికొట్కూరు సీఐ అశోక్‌కుమార్ హెచ్చరిక నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నందికొట్కూరు పట్టణం సంగయ్యపేటకు చెందిన మీనిగ మోహన్ (26) బజార్ నుంచి చికెన్ తీసుకుని ఇంటికి వెళ్తుండగా సంగయ్యపేట మెయిన్ రోడ్డులో కొందరు వ్యక్తులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో మోహన్ ఎడమ కంటి వద్ద, ఎడమ కాలికి రక్తగాయాలయ్యాయి. ఈ నెల 18న వినాయక నిమజ్జనం సందర్భంగా సంగయ్యపేటలో డాక్టర్ మల్లయ్య ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా మహిళలు నృత్యం చేస్తున్న విషయాన్ని చూసేందుకు వచ్చిన క్రమంలో మాటామాటా పెరిగి తోపులాట జరిగినట్లు సమాచారం. అదే మనస్పర్థలను మనసులో పెట్టుకుని ఆదివారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సందులో మోటార్‌సైకిల్‌ను అడ్డంగా పెట్టి తనపై దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులు సుమారు 50 మంది ఎదుటివారి ఇళ్ల వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుడు మీనిగ మోహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ఈ ఘటనపై నందికొట్కూరు సీఐ అశోక్‌కుమార్ స్పందించారు. పట్టణంలో ఎక్కడ గొడవ జరిగినా ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు. గొడవలు జరిగే ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరోసారి గొడవల్లో పాల్గొని శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే పలుమార్లు గొడవలకు పాల్పడే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు