దస్తురాబాద్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన ఎంబాడి సతీష్ (27) విద్యుత్ షాక్‌కు గురై ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్‌ఐ సాయికుమార్ తెలిపారు. ఎంబాడి భీమయ్య కుమారుడైన సతీష్ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంట్లో ఉన్న ఇనుప విద్యుత్ కూలర్‌ను పక్కకు జరిపే క్రమంలో దానిని తాకడంతో సతీష్ విద్యుత్ షాక్‌కు గురైనట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సతీష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే దస్తురాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి భీమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని, ప్రస్తుతం దస్తురాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ సాయికుమార్ తెలిపారు