రోజుల్లో భూ సర్వే పూర్తి చేసి లేఅవుట్ మ్యాప్ సిద్ధం చేయాలి ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు గోదాములను ఏర్పాటు చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. 15 రోజుల్లో భూ సర్వే నిర్వహించి భూమి వివరాలతో పాటు పూర్తి స్థాయి లేఅవుట్ మ్యాప్ సిద్ధం చేయాలని, 5 వేల నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని రెవెన్యూ, మార్కెట్ అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, వేలేరు మండలం సోడాషపల్లిలో వరంగల్ ఏనుమాముల మార్కెట్ అధీనంలో ఉన్న స్థలాలను మార్కెట్ చైర్మన్ ఎర్ర ప్రియాంక అనిల్‌తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ పరిధిలో ఎంత భూమి ఉందో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. అందులో మోడల్ స్కూల్, ప్రస్తుతం ఉన్న గోదాం నిర్మాణానికి ఎంత భూమి కేటాయించారు, ఇంకా ఎంత భూమి అందుబాటులో ఉందో గుర్తించాలని సూచించారు. భూమి సరిహద్దులను నిర్ధారించి 15 రోజుల్లో పూర్తి స్థాయి లేఅవుట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న భూమిని వినియోగంలోకి తెచ్చే విధంగా అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. వేలేరు మండలం సోడాషపల్లి గ్రామ పరిధిలోని మార్కెట్ స్థలంలో ఉన్న సబ్‌యార్డు వద్ద వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు జంగిల్ క్లియరెన్స్, విద్యుత్, తాగునీటి సౌకర్యాలను వెంటనే కల్పించాలని అన్నారు. ఐదు ఎకరాల స్థలంలో రూ.2 కోట్లతో నిర్మించిన సబ్‌యార్డు ఎందుకు నిరుపయోగంగా ఉందని మార్కెట్ అధికారులను ప్రశ్నించారు. రైతుల అవసరాలకు, ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఉపయోగపడే విధంగా సబ్‌యార్డును సిద్ధం చేయాలని తెలిపారు. అక్కడ ఉన్న ఐదు ఎకరాల భూమికి సంబంధించి పూర్తి స్థాయి లేఅవుట్ మ్యాప్‌తో పాటు 5 వేల నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సోడాషపల్లి మార్కెట్ సబ్‌యార్డును వినియోగంలోకి తేవడంతో పాటు గోదాం నిర్మాణం చేపట్టడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని, వేలేరు మండల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కడియం శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏనుమాముల మార్కెట్ చైర్మన్ ఎర్ర ప్రియాంక అనిల్, వైస్ చైర్మన్ బండి జనార్దన్, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, డైరెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ గ్రామాల సర్పంచులు, ధర్మసాగర్, వేలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు