సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి గోదావరిఖని, (ఆంధ్రప్రభ) : సింగరేణి బొగ్గు గాని కార్మికుల సొంతింటి కలలు నెరవేర్చడమే తమ ప్రధాన లక్షమని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికుల సొంతింటి కలలు నెరవేర్చే దిశగా సిఐటియు పనిచేస్తుందని చెప్పారు. దశాబ్దాల పాటు సింగరేణి పరిశ్రమలు పనిచేస్తూ వస్తున్న కార్మికులకు సొంతింటి కల పథకం ఎంతో ప్రయోజనం చేపడుతుందని పేర్కొన్నారు. కార్మికులకు మేలు చేసే దిశగా యాజమాన్యం, తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. సొంతింటి పథకానికి సంబంధించిన అంశంపై సింగరేణి చైర్మన్ తో పాటు డైరెక్టర్లు అందరికీ సమగ్రమైన నివేదికను అందజేసినట్లు తెలిపారు. కార్మికులకు మేలు జరిగేంతవరకు తమ యూనియన్ నిర్విరామంగా కృషి చేస్తుందని రాజారెడ్డి స్పష్టం చేశారు. కొందరు కార్మిక సంఘాలకు చెందిన నాయకులు ఈ పథకం సాధ్యం కాదని చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. సింగరేణి కార్మికులకు సొంతింటి పథకానికి సంబంధించిన అంశాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని అభినందిస్తూ, ధన్యవాదములు తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు కుమారస్వామి, ఆరెపల్లి రాజమౌళి, కుంట ప్రవీణ్ కుమార్, అంబల శ్రీనివాస్, వెంకన్న, శ్రీహరి, వినేష్, పాల్గొన్నారు