పత్రికా రంగంలో విశేష సేవలకు గుర్తింపుగా సత్కారం అచ్చంపేట, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ జిల్లా వాసి, పత్రికా రంగంలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తూ సామాజిక చైతన్యం కోసం కృషి చేస్తున్న అరుకలి పరిపూర్ణం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. పుదుచ్చేరిలోని షణ్ముగ రెసిడెన్సీలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో గ్లోబల్ అక్రిడిటేషన్ కౌన్సిల్, జర్మనీ సభ్యుడు జోన్‌బర్గ్ జార్జ్ పీటర్ చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని స్వీకరించారు. మూఢనమ్మకాలు, సామాజిక వివక్ష తదితర అంశాలపై కథనాలు ప్రచురిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో పరిపూర్ణం కీలక పాత్ర పోషిస్తున్నారని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న 26 మందికి ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్లు అందజేశారు. ఈ సందర్భంగా జోన్‌బర్గ్ జార్జ్ పీటర్ మాట్లాడుతూ సమాజంలోని వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న సామాజిక కార్యకర్తలను గుర్తించి యూనివర్సిటీలు, సంస్థలు గౌరవ డాక్టరేట్లతో సత్కరిస్తున్నాయని తెలిపారు. గౌరవ డాక్టరేట్ పొందిన వారి సామాజిక బాధ్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛత, మానవత్వంతో సామాజిక సేవలో ముందుకు సాగుతూ ప్రజల కోసం మరింత కృషి చేయాలని సూచించారు. కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీపీఎం నాయకులు జాన్ వెస్లీ, తమ్మినేని వీరభద్రం, కూనమనేని సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. పరిపూర్ణం ఇటీవల హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన నవతెలంగాణ 11వ వార్షికోత్సవంలో ఉత్తమ వార్తా కథనాలకు అవార్డు అందుకున్నారు. గతంలోనూ ఆయన పలు పురస్కారాలు అందుకున్నారు. 2012లో కర్నూలు జిల్లా కేంద్రంలో అప్పటి విద్యాశాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చేతుల మీదుగా వీఆర్ బొమ్మిరెడ్డి అవార్డు అందుకున్నారు. 2013లో రాజమండ్రిలో మరోసారి అదే అవార్డును స్వీకరించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం మహబూబ్‌నగర్‌లో రోనాల్డ్ రోజ్ ఉత్తమ జర్నలిస్టు అవార్డుతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉత్తమ జర్నలిస్టు అవార్డును అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో వల్లూరి ఫౌండేషన్, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనూ ఉత్తమ జర్నలిస్టుగా సత్కారం పొందారు. తాజాగా గౌరవ డాక్టరేట్ అందుకోవడంతో ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు