దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఐఐటీ బాంబే పవయీ క్యాంపస్‌లో తీవ్ర కలకలం రేగింది. పరీక్షలో మొబైల్ ఫోన్ వినియోగిస్తూ దొరికిపోయిన ఓ విద్యార్థి మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన క్యాంపస్‌లో తీవ్ర విషాదాన్ని నింపడంతో పాటు విద్యార్థుల ఆందోళనకు దారితీసింది. ఐఐటీ బాంబేలోని ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్ (19) అనే విద్యార్థి ఇటీవల పరీక్ష రాస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించాడు. అంతేకాకుండా ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేస్తూ ఇన్విజిలేటర్లకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటనపై ఇన్‌స్టిట్యూట్ అధికారులు ఆయనపై ఎలాంటి కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. కేవలం డిపార్ట్‌మెంట్ హెడ్ స్వయంగా సాహిల్‌ను పిలిచి మందలించి, కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ మనోవేదనకు గురైన సాహిల్ శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది ఐఐటీ బాంబే క్యాంపస్‌లో చోటుచేసుకున్న నాలుగో మరణం ఇది కావడం గమనార్హం. వరుసగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండటంతో యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి క్యాంపస్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వరుస ఆత్మహత్యలపై యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో క్యాంపస్‌లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఐఐటీ బాంబే యాజమాన్యం స్పందిస్తూ.. విద్యార్థి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విచారకర సమయంలో మృతుడి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఘటనకు గల అసలు కారణాలపై పోలీసులతో కలిసి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను