పొలానికి వెళ్తుండగా అదుపుతప్పిన వాహనం.. అక్కడికక్కడే మృత్యువాత రొంపిచర్ల, ఆంధ్రప్రభ: పొలం దున్నేందుకు ట్రాక్టర్‌పై వెళ్తున్న డ్రైవర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో మృతి చెందిన సంఘటన మండలంలోని గోగులపాడు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోగులపాడు గ్రామానికి చెందిన దావులూరి భాస్కరరావు (43) ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. శనివారం గ్రామంలోని బొగ్గరం రోడ్డు వద్ద అలవాల మేజర్ కాలువ సమీపంలో ఉన్న తన పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లారు. పొలం వద్దకు చేరుకున్న తర్వాత ఎత్తైన రహదారి నుంచి లోతుగా ఉన్న పొలంలోకి ట్రాక్టర్‌ను దించుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ కింద పడిన భాస్కరరావు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, బోల్తా పడిన ట్రాక్టర్‌ను పైకి లేపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భాస్కరరావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేశ్వరరావు తెలిపారు