డ్యామ్‌లో 41.65 మీటర్ల వద్ద స్టోరేజీ ఏపీకి కేంద్రం గతంలోనే గ్రీన్‌సిగ్నల్ 9న పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ బ్యాక్‌వాటర్‌తో తెలంగాణలో భద్రాద్రి, పలు గ్రామాలు నీట మునిగే ప్రమాదం హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని పోలవరం డ్యామ్‌లో ఈ ఏడాది నుంచే నీటిని నిల్వ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతున్నది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం సైతం దానికి ఆమోదం తెలిపింది. ఆ దిశగా ఏపీ సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తున్నది. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సైతం నీటినిల్వ అంశంపై అన్ని రాష్ర్టాల సమ్మతి కోసం సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 9న పీపీఏ 18వ బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సమాచారాన్ని ఇప్పటికే అన్ని రాష్ర్టాలకు అందించినట్టు తెలుస్తున్నది. కానీ, పోలవరంలో నీటినిల్వ కారణంగా వెనుక జలాలతో తెలంగాణలో భద్రాద్రి సహా పలు గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టక ముందే నీటినిల్వకు సన్నాహాలు ప్రారంభించడం, ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తుండటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టులో నీటినిల్వతో ముంపుతోపాటు, ఇతర అనేక సాంకేతిక అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ర్టాలతో ఏకాభిప్రాయం సాధించాలని కోర్టు ఇప్పటికే ఆదేశించింది. అందులో భాగంగా గతంలో సీడబ్ల్యూసీ పలుమార్లు అన్ని రాష్ర్టాలతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా గతంలోనే కేసీఆర్ నేతృత్వంలోని నాటి బీఆర్‌ఎస్ సర్కార్ సహేతుకమైన అధ్యయనాలు, గణాంకాలతో బలమైన వాదనలు వినిపించింది. ఆ వాదలన్నింటితో కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ ఏకీభవించింది. పోలవరం బ్యాక్‌వాటర్ కారణంగా ప్రవాహానికి ఎదురుగా అఫ్లక్స్ ఏర్పడిందని అంగీకరించాయి. గోదావరి నదికి ఇరువైపులా ఉన్న అన్ని ప్రధాన ప్రవాహాలను కవర్ చేస్తూ జాయింట్ సర్వే చేయిస్తామని, అందుకు సంబంధించిన వివరాలివ్వాలని తెలంగాణకు 2022లోనే సూచించింది. వెంటనే ఆ మేరకు జాయింట్ సర్వే చేపట్టాలని పీపీఏ, ఏపీ ప్రభుత్వానికి సైతం కేంద్ర జలసంఘం స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. కానీ ఇప్పటికీ ఆ దిశగా ఒక్క అడుగు పడలేదు. సీడబ్ల్యూసీ మళ్లీ జోక్యం చేసుకొని ఉమ్మడి సర్వే పూర్తికి నియమిత కాలపరిమితిని విధిస్తూ పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కు అల్టిమేటం జారీచేసింది. తొలుత తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతో సమావేశం నిర్వహించాలని, ముంపుపై ఇరు రాష్ర్టాలు గతంలో చేసిన అధ్యయనాలపై, రూపొందించిన మ్యాపులపై చర్చించాలని దిశానిర్దేశం చేసింది. అంతేకాదు ఏపీ సహకరించినా, సహకరించకపోయినా తెలంగాణతో కలిసి ఉమ్మడి సర్వే నిర్వహించాలని, ఆబాధ్యత పీపీఏదేనని తేల్చిచెప్పింది. దీంతో పీపీఏ, ఏపీ ఆ మధ్య కొంత హడావుడి చేశాయి. జాయింట్ సర్వేకు ప్రత్యేకంగా అధికార బృందాన్ని నియమించడంతోపాటు, సర్వే నిర్వహణకు అనుకూలమైన తేదీలు తెలుపాలని తెలంగాణకు సమాచారం అందించాయి. తీరా సర్వే చేసేందుకు వచ్చిన ఏపీ మళ్లీ పేచీ పెట్టింది. తెలంగాణ డిమాండ్ల మేరకు సర్వే చేయడం