Kaizer News

Polavaram: నక్కపల్లిలో పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్ట్

Polavaram: నక్కపల్లిలో పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్ట్ ప్రారంభం!

· State - Telangana · hmtvlive.com

Polavaram: గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించే దిశగా మరో కీలక ముందడుగు పడనుంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అందుబాటులోకి రానుండటంతో అనకాపల్లి, విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తాగునీరు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు మరింత ప్రయోజనం చేకూరనుందని అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 2న నక్కపల్లిలో జరగనున్న పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కోటిని బాలాజీతో పాటు కూటమి క్లస్టర్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. అనకాపల్లి ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన గోదావరి జలాల సాధనకు మరో కీలక అడుగు పడుతోందన్నారు. గతంలో జరిగిన అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకురావాలనే లక్ష్యం సాకారం దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పురుషోత్తపట్నం నుంచి అనకాపల్లి మీదుగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలగనుందని తెలిపారు. భవిష్యత్తులో ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాలకు 24 గంటలూ తాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో ప్రజల తాగునీటి అవసరాలు తీరడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి, వ్యవసాయ రంగానికి మరింత ఊతం లభిస్తుందని కొణతాల రామకృష్ణ వివరించారు. ఈ మహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 2న నక్కపల్లిలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. సెప్టెంబర్ 2న నక్కపల్లిలో జరిగే కార్యక్రమాన్ని కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన జలశకానికి స్వాగతం పలుకుదామని ఆయన అన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News