Kaizer News

ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం! వర్షాల

ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం! వర్షాలపై తాజా రిపోర్ట్ ఇదే..

· State - Telangana · tv9telugu.com

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం 8.30 గంటలకు మరింత బలపడింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి అమృత్‌సర్, ముజఫర్‌నగర్, హర్దోయ్, గోరఖ్‌పూర్, పాట్నా, బంకురా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతోంది. అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు విస్తరించి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం కూడా ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలోనూ మూడు రోజుల పాటు ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి. అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, జల్లులతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది

Original source: tv9telugu.com
Read more on Kaizer News