క్రెడిట్ కార్డుల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరాల ముఠాను రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో ఉన్న ఒక కాల్ సెంటర్‌పై దాడి చేసి, ఏకంగా 43 మంది మహిళలతో సహా మొత్తం 83 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... యాక్సిస్ బ్యాంక్ డీగ్ బ్రాంచ్ మేనేజర్ ఫూల్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ దర్యాప్తు ప్రారంభమైంది. వాళ్ళ బ్యాంకు పేరుతో కొందరు నకిలీ ఐడీలు, విజిటింగ్ కార్డులు సృష్టించి ప్రజలకు క్రెడిట్ కార్డులు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆగస్టు 20న డీగ్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూపీలోని అజంగఢ్‌కు చెందిన ఆకాష్ రాథోర్ అనే యువకుడు ఓ కస్టమర్‌కు ఫోన్ చేసి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇప్పిస్తానని నమ్మించాడు. కానీ కస్టమర్‌కు అనుమానం వచ్చి వివరాలు కోరగా, ఆకాష్ వాట్సాప్ ద్వారా నకిలీ యాక్సిస్ బ్యాంక్ విజిటింగ్ కార్డ్, ఐడీ కార్డ్‌ను పంపాడు. దింతో కస్టమర్ ఆ విజిటింగ్ కార్డ్, ఐడీ కార్డ్ బ్యాంకులో పనిచేస్తున్న తన ఫ్రెండ్ కి చూపించగా, అవి నకిలీవని తేలింది. వెంటనే బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఢిల్లీలో పోలీసుల మెరుపు దాడి ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆకాష్ రాథోర్‌ను అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను ఇచ్చిన సమాచారంతో రాజస్థాన్ పోలీసులు ఢిల్లీకి వెళ్లారు. స్థానిక ఢిల్లీ పోలీసుల సహకారంతో ఉత్తమ్ నగర్‌లోని మూడు అంతస్తుల భవనంలో నడుస్తున్న 'ఆనంద్ ఎంటర్‌ప్రైజెస్' కార్యాలయంపై సైబర్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. కాల్ సెంటర్ ముసుగులో మోసాలు: ఆ ఆఫీసులో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ట్రైనీలు ఉంటూ.. ప్రజలకు ఫోన్లు చేస్తూ క్రెడిట్ కార్డుల పేరుతో వల వేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో 43 మంది మహిళలతో సహా మొత్తం 83 మందిని అదుపులోకి తీసుకుని విచారణ కోసం రాజస్థాన్‌లోని డీగ్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తు: ఈ కాల్ సెంటర్‌ను సలోని మిట్టల్ (47) అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. నకిలీ ఐడీలు ఎవరు సృష్టించారు ? కస్టమర్ల డేటా వీరికి ఎలా వచ్చింది ? దీని వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. అదుపులోకి తీసుకున్న 83 మందిని విచారిస్తూ.. ఈ నెట్‌వర్క్‌కు ఇతర రాష్ట్రాల్లోని సైబర్ నేరాలతో సంబంధాలున్నాయా అని కూడా ఆరా తీస్తున్నారు