కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం ఎలగడప ఎంపీపీఎస్ పాఠశాల హెచ్‌ఎం కూచనపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఎలగడపలోని స్థానిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ అశ్విత రమేష్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాపర్తి శ్రీనివాస్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొని శ్రీనివాస్‌ను పూలమాలలు, శాలువాలు, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కడెం మండల విద్యాధికారి మెరుగు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కూచనపల్లి శ్రీనివాస్ తన వృత్తి నైపుణ్యంతో చక్కటి టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎం) తయారు చేసి విద్యార్థులకు మెరుగైన బోధన అందిస్తున్నారని ప్రశంసించారు. ఆయన ఏ పాఠశాలలో పనిచేసినా విద్యార్థుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు వారానికి మూడు కోడిగుడ్లు అందిస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. గ్రామ సర్పంచ్ అశ్విత రమేష్ మాట్లాడుతూ.. హెచ్‌ఎం శ్రీనివాస్ విద్యార్థులతో ఒకరిగా కలిసిపోయి చక్కటి బోధన అందిస్తున్నారని అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీనివాస్ ఎలగడప గ్రామానికి రావడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు బిక్షపతి నాయక్ మాట్లాడుతూ.. తన గురువు కూచనపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం శ్రీనివాస్‌ను పూలమాలలు, శాలువాలు, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉర్దూ మీడియం పాఠశాల హెచ్‌ఎం సనా కౌసర్, పంచాయతీ కార్యదర్శులు పద్మ, భూమేష్, మాజీ సర్పంచ్ ఆగునూరి సత్యమ్మ, గంగన్న, పీఏసీఎస్ డైరెక్టర్ భూమరాజం, నాయకులు లక్ష్మీరాజం, శ్రీపతి, వెంకన్న, రాపర్తి పెద్ద లక్ష్మణ్, నరసయ్య, షేక్ అహ్మద్, నాంపల్లి రాజేందర్, ఎండీ అహ్మద్ హుస్సేన్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మాసాయిపేట భజన కళాకారుల బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు