Kaizer News

Kukunoor: కేంద్ర విధానాలపై సమరశంఖం: 'ఛలో ఢిల్లీ'కి

Kukunoor: కేంద్ర విధానాలపై సమరశంఖం: 'ఛలో ఢిల్లీ'కి సీపీఐ పిలుపు!

· State - Telangana · hmtvlive.com

Kukunoor: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ‘బద్లావ్ జరూరీ హై–మార్పు కావాలి’ మహార్యాలీని జయప్రదం చేయాలని సీపీఐ కుక్కునూరు మండల కార్యదర్శి కొన్నె లక్ష్మయ్య పిలుపునిచ్చారు. శనివారం కుక్కునూరులోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా దేశ ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందని విమర్శించారు. ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలను అరికట్టాలని, సార్వత్రిక విద్య, వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రైతులు పండించిన పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలని, దేశంలోని నిరుద్యోగులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలో మిగిలి ఉన్న భూములకు కుక్కునూరు మండలాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన తరహాలో పరిహారం, పునరావాస ప్రయోజనాలు కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే మహార్యాలీకి కుక్కునూరు మండలం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని లక్ష్మయ్య కోరారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు వరకా శ్యామల, జిల్లా సమితి సభ్యుడు అయితా సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News