Kaizer News

ఎన్నికల కసరత్తు ముమ్మరం.. ఓటర్ల జాబితా సిద్ధం

ఎన్నికల కసరత్తు ముమ్మరం.. ఓటర్ల జాబితా సిద్ధం

· State - Telangana · prabhanews.com

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు వేగం.. పోలింగ్‌ కేంద్రాల వివరాలు బహిర్గతం ఏలూరు, (ఆంధ్రప్రభ) : జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్‌ కేంద్రాలు, ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఏలూరులోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, జిల్లా పరిషత్‌ కార్యాలయం, జిల్లా పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల వివరాలు, పోలింగ్‌ కేంద్రాల జాబితాలను ప్రదర్శించారు. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్‌ ఇన్‌చార్జి సీఈఓ మల్లికార్జునరావు ఈ జాబితాలను పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఓటర్లు, అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా తెలుసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును ఎక్కడ వినియోగించుకోవాలన్న దానిపై స్పష్టత కల్పించేందుకు పోలింగ్‌ కేంద్రాల వివరాలను ముందుగానే ప్రకటించారు. నోటీసు బోర్డుల్లో ఉంచిన జాబితా ద్వారా ఓటర్లు తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించుకునే అవకాశం కల్పించారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా కీలకమైన అంశం. ఎంపీటీసీ, జడ్పీటీసీ పరిధుల వారీగా ఓటర్ల వివరాలను అందుబాటులో ఉంచారు. తమ పేరు, ఇతర వివరాలను ఓటర్లు పరిశీలించుకోవచ్చు. జాబితాలో ఏవైనా తప్పులు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించారు. ఎన్నికల సమాచారం అందరికీ చేరేలా జిల్లా కేంద్రంలోని మూడు ప్రధాన కార్యాలయాల్లో జాబితాలను ప్రదర్శించారు. దీంతో ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల వివరాలను పరిశీలించుకునే వీలు కలిగింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఓటర్లకు అవసరమైన సమాచారం సకాలంలో అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News