Shorts Kamareddy: కామారెడ్డిలోని వరలక్ష్మి గార్డెన్స్‌లో హిందీ ఫోరం ఆధ్వర్యంలో హిందీ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. హిందీ జనసంపర్క భాషగా విశేష ప్రాధాన్యం పొందిందన్నారు. హిందీని ప్రతి ఒక్కరూ ఆదరించి, అభ్యసించాలని పిలుపునిచ్చారు. శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వాసాల వరప్రసాద్ హిందీ సాహిత్య వైభవం, భాషా విలువలను వివరించారు. ఈ సందర్భంగా బిబిపేట ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయులు నర్సింలు రూపొందించిన ‘హిందీ అభ్యాస దీపిక’ స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించారు. హిందీ దివస్ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పాటలు, నృత్యాలు, నాటికలు, దేశభక్తి గేయాలు ఆకట్టుకున్నాయి. వివిధ మండలాలకు చెందిన సీనియర్ హిందీ పండితులను సన్మానించడంతో పాటు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందీ ఫోరం జిల్లా అధ్యక్షులు ఇంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సహేందర్ నాథ్, కోశాధికారి విక్రమ్ కుమార్, ముఖ్య సలహాదారులు ఘఫుర్ శిక్షక్ తో పాటు పలువురు హిందీ పండితులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు