తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ: తొర్రూరు మండలం దుబ్బతండ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కాశిగుడెంకు తరలించాలని కోరుతూ తొర్రూరు సీడీపీఓకు రాసినట్లు చెబుతున్న లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబ్బతండ సర్పంచ్ విజయ సంతకం, అధికారిక ముద్రతో ఉన్న ఈ లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో కొత్తగా అంగన్‌వాడీ పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతుండటంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖలో దుబ్బతండలోని ఇంటి నంబర్ 7-3లో అంగన్‌వాడీ కేంద్రం కొనసాగుతోందని, కేంద్రంలో 12 మంది చిన్నారులకు టీహెచ్‌ఆర్ అందిస్తున్నట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రీ-స్కూల్ వయసు పిల్లలు ఐదుగురు ఉన్నప్పటికీ వారు అంగన్‌వాడీ కేంద్రానికి హాజరు కాకుండా తొర్రూరులోని ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నారని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో కేంద్రం నిరుపయోగంగా మారిందని, అంగన్‌వాడీ కేంద్రాన్ని కాశిగుడెంకు తరలించాలని సీడీపీఓను కోరినట్లు లేఖలో ఉంది. అయితే వైరల్‌గా మారిన ఈ లేఖలోని వివరాలపై అధికారుల నుంచి పూర్తిస్థాయి వివరణ వెలువడాల్సి ఉంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్యతో పాటు ఆరోగ్య సంబంధిత సేవలు అందుతాయి. ఇలాంటి కేంద్రంలో చిన్నారుల హాజరు, సేవల వినియోగంపై సర్పంచ్ పేరుతో ఉన్న లేఖలో వివరాలు పేర్కొనడం స్థానికంగా చర్చకు దారితీసింది. వైరల్ అవుతున్న లేఖ వాస్తవమేనా? అందులో పేర్కొన్న చిన్నారుల సంఖ్య, వారి హాజరు పరిస్థితి ఏమిటి? కేంద్రాన్ని తరలించాల్సిన అవసరం ఉందా? అనే అంశాలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. అధికారుల వివరణతోనే ఈ వ్యవహారంపై పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది