Kaizer News

Sandeep Reddy | సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్న స

Sandeep Reddy | సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్న సినిమాకు ప్రత్యేక అతిథిగా రౌడీ హీరో..!

· Entertainment · ntnews.com

Sandeep Reddy | సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రోమాంచకం’. యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా ఇది లవ్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో రూపొందిన సినిమా కావడంతో యూత్ ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘రోమాంచకం’ సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేస్తూ చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 30న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు నిర్మాత సందీప్ రెడ్డి వంగా కూడా హాజరుకానున్నారు. అయితే ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రత్యేక అతిథిగా పాల్గొనబోతుండటం ఇప్పుడు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత కీలకమైన సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి’ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం విజయ్ కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పి ఆయనకు స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం, అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకే సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా నిర్మిస్తున్న ‘రోమాంచకం’ సినిమా ప్రమోషన్స్‌కు విజయ్ దేవరకొండ స్వయంగా మద్దతుగా నిలుస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా రావడం ద్వారా చిత్రబృందంలో మరింత జోష్ తీసుకురానున్నారు. విజయ్ దేవరకొండ హాజరవుతుండటంతో ‘రోమాంచకం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ ఒకే వేదికపై కనిపించబోతుండటంతో అభిమానులు ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మొత్తానికి సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రాబోతున్న ‘రోమాంచకం’ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా మరింత భారీ ప్రచారం లభించే అవకాశం కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ రాకతో ఈ వేడుక ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో చూడాలి

Original source: ntnews.com
Read more on Kaizer News