Kaizer News

Kothapalli: పవన్ కళ్యాణ్‌పై బురదజలితే ఊరుకోం - జనస

Kothapalli: పవన్ కళ్యాణ్‌పై బురదజలితే ఊరుకోం - జనసేన ఇంచార్జ్

· State - Telangana · hmtvlive.com

కొత్తపల్లి: నాగులపల్లి గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ సర్పంచ్ వడిశెట్టి గౌరీ రాజేశ్వరి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంపై కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ ఘాటుగా స్పందించారు. రావు అక్షయ్ మాట్లాడుతూ.. “సీనియర్ రాజకీయ నాయకుడైన నారాయణరెడ్డి గారికి రాజకీయ అనుభవం ఉంది. వాస్తవాలు ఏమిటో తెలుసుకునే సామర్థ్యం కూడా ఉంది. నిన్న స్వయంగా నాకు ఫోన్ చేసి విషయాలు అడిగారు. కానీ ఈరోజు అదే విషయాన్ని రాజకీయంగా వక్రీకరించి పవన్ కళ్యాణ్ గారిపై బురదజల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు. పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధిని కళ్లుండి చూడలేని వారు మాత్రమే విమర్శలు చేస్తారని అన్నారు. కొత్తపల్లి మండలంలో జరుగుతున్న అభివృద్ధి, గ్రామాల్లో వేస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతుల పనులు కనిపించడం లేదా? లేక కనిపించినా రాజకీయ స్వార్థం కోసం కనిపించనట్టుగా నటిస్తున్నారా? అని ప్రశ్నించారు. “ప్రజలకు ఏదో అన్యాయం జరుగుతోందని ఒక అపోహను సృష్టించి, దానిని రాజకీయ ఆయుధంగా మార్చుకోవాలనే ప్రయత్నాలు ఇక సాగవు. గ్రామ సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లండి, పరిష్కారం కోసం పోరాడండి. అంతే తప్ప అభివృద్ధిని రాజకీయ రంగు పులిమి పవన్ కళ్యాణ్ గారిపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు కూడా గమనిస్తున్నారు” అని అక్షయ్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ గ్రాఫ్‌ను అందుకోవడం సంగతి పక్కన పెడితే, ఆయన ప్రజల్లో సంపాదించుకున్న విశ్వాసానికి దగ్గరగా రావడం కూడా ప్రత్యర్థులకు సాధ్యం కాదని అన్నారు. “మీకు వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోండి. కానీ పవన్ కళ్యాణ్ గారిపై రాజకీయంగా బురదజల్లుదాం, ప్రజల్లో అపోహలు సృష్టిద్దాం అంటే మాత్రం జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసే బాధ్యత మాపై ఉంది. అభివృద్ధి చేసే నాయకుడిని విమర్శించడం కాదు.. అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలను ప్రజల ముందు ఎండగడతాం” అని రావు అక్షయ్ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారి విధానం రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు కాదని, “ప్రజలకు మంచి చేయాలి.. పిఠాపురం నియోజకవర్గ రూపురేఖలు మార్చాలి.. ప్రతి గ్రామానికి అభివృద్ధి అందాలి” అనే సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారని అక్షయ్ తెలిపారు. నాగులపల్లి గ్రామ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వారిని తాము శత్రువులుగా చూడబోమని, సమస్య పరిష్కారం కోసం నిర్మాణాత్మకంగా ముందుకు వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జనసేన సిద్ధంగా ఉందని అన్నారు. అయితే అభివృద్ధి పేరుతో రాజకీయ దుష్ప్రచారం చేస్తే మాత్రం ప్రజలే తగిన సమాధానం చెబుతారని రావు అక్షయ్ స్పష్టం చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News