Shorts Warangal: నగరంలోని సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది రజతోత్సవ వేడుకలుగా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సంస్థ అధినేత గంట రవికుమార్ సారథ్యంలో 2001లో ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు ఈ ఏడాదితో విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రాంగణంలో కొలువుదీరిన కమల గణనాథుడికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. 25 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కమల గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, 108 రకాల ప్రసాదాలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ ప్రత్యేక నైవేద్య కార్యక్రమంలో భక్తులు, విద్యార్థులు, సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ సిబ్బంది, నగర ప్రజలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ, 2001లో ప్రారంభమైన గణనాథుడి ఉత్సవాలు నేడు 25వ సంవత్సరానికి చేరుకోవడం భగవంతుడి ఆశీస్సులతో పాటు విద్యార్థులు, భక్తులు, నగర ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. ప్రతి ఏడాది వినూత్న రీతిలో గణనాథుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ రజతోత్సవ వేడుకల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ అధినేత గంట రవికుమార్ తెలిపారు