Kaizer News

Sakhinetipalli: మాజీ ఎంపీటీసీ పడాల సత్యనారాయణ విగ్

Sakhinetipalli: మాజీ ఎంపీటీసీ పడాల సత్యనారాయణ విగ్రహావిష్కరణ

· State - Telangana · hmtvlive.com

Shorts సఖినేటిపల్లి: గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సఖినేటిపల్లి లంక మాజీ ఎంపీటీసీ సభ్యులు స్వర్గీయ పడాల సత్యనారాయణ గారి నిలువెత్తు శిలా విగ్రహాన్ని ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనిషి జీవితం తాత్కాలికమైనా, ప్రజల కోసం చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, పడాల సత్యనారాయణ జీవితం అందుకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. ఎంపీటీసీగా ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషిస్తూ, గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేసిన ఆయన సేవలను కొనియాడారు. రేవు ఆదాయంలో సగభాగాన్ని సఖినేటిపల్లి మండల పరిషత్, గ్రామ పంచాయతీకి కేటాయించేలా కృషి చేయడం ద్వారా ప్రజా సంక్షేమం పట్ల తన నిబద్ధతను చాటుకున్నారని గుర్తుచేశారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, గ్రామ అభివృద్ధిని తన బాధ్యతగా స్వీకరించిన పడాల సత్యనారాయణ సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ గ్రామ ప్రగతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన జ్ఞాపకాలను శాశ్వతంగా నిలిపేలా విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, జనసేన, టీడీపీ, భాజపా నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News