Shorts వినాయక చవితి నిమజ్జన వేడుకలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. డీజే హోరును తట్టుకోలేక ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, నిమజ్జన ఊరేగింపులో నృత్యం చేసి ఇంటికి వెళ్లిన మరో యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన ఈ రెండు వేర్వేరు ఘటనలు స్థానికంగా కలకలం సృష్టించాయి. కర్నూలు గ్రామీణ మండలం ఇ.తాండ్రపాడు గ్రామానికి చెందిన శివమ్మ (36) భర్త, కుమారుడు గతంలోనే అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆమె తన సోదరుడి ఇంటి వద్దే ఉంటోంది. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన వేడుకలకు ఆమె వెళ్లారు. అక్కడ డీజే శబ్దాలకు అనుగుణంగా కొద్దిసేపు నృత్యం చేశారు. అయితే, కొద్దిసేపటికి ఆమెకు కడుపులో నొప్పి రావడంతో మండపం నుంచి ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో భారీ డీజే శబ్దాల తీవ్రతను తట్టుకోలేక ఒక్కసారిగా కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోయారు. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన గణేశ్‌గౌడ్ (23) స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు వెళ్లారు. అక్కడ విగ్రహ ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేశారు. కొద్దిసేపటికి అస్వస్థతకు గురికావడంతో ఆయన ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు రావడంతో గణేష్ మృతి చెందాడు. పండుగ వేళ పండంటి యువకులు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ రెండు కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను