Kaizer News

గుడ్లవల్లేరు మండలంలో రూ.4.17 కోట్లతో రోడ్ల అభివృద్

గుడ్లవల్లేరు మండలంలో రూ.4.17 కోట్లతో రోడ్ల అభివృద్ధి

· State - Telangana · prabhanews.com

గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ: గుడ్లవల్లేరు మండలంలో సాస్కి నిధులతో రూ.4.17 కోట్లతో చేపట్టిన పలు రోడ్ల అభివృద్ధి పనులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శ్రీకారం చుట్టారు. కూటమి నాయకులతో కలిసి ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు. విన్నకోట, కట్టవాని చెరువు గ్రామాల్లో ఇప్పటికే రూ.74 లక్షల నిధులతో రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా పోలిమెట్ల నుంచి పెంజండ్ర వరకు రూ.1.10 కోట్లతో, కౌతవరం నుంచి చేవెండ్ర వరకు రూ.1.80 కోట్లతో, గాదెపూడి ఎం.ఎన్‌.కె. రహదారికి రూ.57 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. చాలాకాలంగా రోడ్లు అధ్వానంగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు గతంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు తెలిపిన సమస్యలను గుర్తించి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడంపై గ్రామస్థులు ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా గుడివాడ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాల పర్యటనల్లో ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన రోడ్ల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణ, అభివృద్ధిపై నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల పరిస్థితి దారుణంగా మారిందని ఎమ్మెల్యే విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మంచి రహదారులు ఉంటే గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు రైతులు పంటలను మార్కెట్లకు తరలించేందుకు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు, అత్యవసర సమయాల్లో వైద్య సేవలు పొందేందుకు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమని రాము తెలిపారు. రోడ్ల సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పటికే పలు రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో గుడివాడ జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్‌, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పొట్లూరి రవి, మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, చేకూరు జగన్మోహనరావు, కొడాలి రామరాజు, శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్‌ ఈడే మోహన్‌, గోవాడ శివ, అబ్దుల్‌ సత్తార్‌, తూము పద్మజ, పామర్తి సత్తిబాబు, ఆయా గ్రామాల నాయకులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News