దండేపల్లి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం చేసేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆటపాటలతో ప్రజలను చైతన్యపరిచారు. మంచిర్యాల జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, డీపీఆర్వో పర్యవేక్షణలో శనివారం దండేపల్లి మండలం లక్ష్మీకాంతపూర్‌లో ప్రజా చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ముల్కల్ల మురళి బృందం సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రభుత్వ పథకాలు, ప్రజలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలను వివరించింది. ప్రజాపాలనలో భాగంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి ద్వారా ఆర్థిక సాధికారత, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలపై అవగాహన కల్పించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్య పరిరక్షణ చర్యలు పాటించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలుకూరి మహేష్, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు