అండర్-15, అండర్-19, అండర్-23తో పాటు సీనియర్ మహిళా జట్లకు ఎంపికలు సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు ఉప్పల్ స్టేడియంలో నిర్వహణ హైదరాబాద్, ఆంధ్రప్రభ : మహిళా క్రికెటర్ల ఎంపిక కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఓపెన్ సెలక్షన్స్ నిర్వహించనుంది. అండర్-15, అండర్-19, అండర్-23, సీనియర్ మహిళా విభాగాల్లో ఈ ఎంపికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. అండర్-15 బాలికల విభాగానికి సెప్టెంబర్ 1న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ విభాగంలో పాల్గొనే క్రీడాకారిణులు 2011 సెప్టెంబర్ 1 నుంచి 2014 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. అండర్-19 బాలికల విభాగానికి సెప్టెంబర్ 2న ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు సెలక్షన్స్ నిర్వహిస్తారు. ఈ విభాగంలో పాల్గొనే వారు 2007 సెప్టెంబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. అండర్-23, సీనియర్ మహిళా విభాగాల ఎంపికలు సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరగనున్నాయి. ఈ విభాగాల్లో పాల్గొనే క్రీడాకారిణులు 2003 సెప్టెంబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలని హెచ్‌సీఏ తెలిపింది. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారిణులు జనన ధ్రువీకరణ పత్రం జిరాక్స్ ప్రతితో పాటు పూర్తి పరిమాణంలోని ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఆయా విభాగాలకు అక్కడికక్కడే పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. అయితే సెలక్షన్స్‌కు హాజరయ్యే క్రీడాకారిణులు తప్పనిసరిగా రంగుల క్రికెట్ దుస్తులు ధరించి రావాలని హెచ్‌సీఏ స్పష్టం చేసింది. తెలుపు రంగు క్రికెట్ దుస్తులకు అనుమతి లేదని పేర్కొంది. మహిళా క్రికెట్‌లో ప్రతిభ చూపించాలని ఆశిస్తున్న యువ క్రీడాకారిణులకు ఈ ఓపెన్ సెలక్షన్స్ మంచి అవకాశంగా నిలవనున్నాయి