ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : పల్లె పల్లెకు పొన్నం–పల్లె పల్లెల్లో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ శనివారం వినతిపత్రం అందజేశారు. రైతు బీమా పథకంపై రైతుల్లో నెలకొన్న ఆందోళనను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతు కుటుంబాలకు ఎంతో భరోసాగా ఉన్న రైతు బీమా పథకాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించాలని కోరారు. పథకంపై రైతుల్లో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రైతు కుటుంబానికి ప్రధాన ఆధారమైన వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు రైతు బీమా ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ పథకం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని హింగే భాస్కర్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. రైతు బీమా కేవలం ఒక పథకం కాదని, ఆపద సమయంలో రైతు కుటుంబానికి అండగా నిలిచే రక్షణ కవచమని పేర్కొన్నారు. రైతుల ఆందోళనను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, రైతు బీమాను కొనసాగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యను ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతు బీమాపై స్పష్టత కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున కోరినట్లు హింగే భాస్కర్ తెలిపారు