వరంగల్, వెలుగు : వరంగల్ మామునూరు ఎయిర్‍పోర్ట్ నిర్మాణంలో కీలక అడుగు పడింది. విమానాశ్రయ పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ మొదలైంది. మొత్తం రూ.213.59 కోట్ల అంచనాతో చేపట్టే పనులకు టెండర్లు కోరుతూ ఎయిర్‍పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా శుక్రవారం అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసింది. మరికొన్ని రోజుల్లో పనులు ప్రారంభించి 18 నెలల్లోనే పూర్తి చేయాలని నిర్దేశించింది. మామునూరు నిర్మాణ పనుల కోసం ఎయిర్‍పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్ విభాగం ఈ నెల 28న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనుంది. బిడ్లు సమర్పించేందుకు అక్టోబర్ 6 నుంచి అవకాశం ఉండగా.. బిడ్లు దాఖలు చేయడానికి నవంబర్ 3 సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఇచ్చారు. నవంబర్ 9న బిడ్లు పరిశీలించి, అదే నెల 30న ఫైనాన్సియల్ బిడ్లు ఇవ్వనున్నారు. టెండర్ల ప్రక్రియలో పనులు దక్కించుకునే సంస్థ ఎయిర్‍పోర్ట్ లో ప్రధానమైన డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టనుంది. దీంతో పాటు విమానాల రాకపోకలను పర్యవేక్షించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ తో పాటు విద్యుత్ సరఫరా అందించే ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్, మెయింటెనెన్స్ పనుల కోసం ఈ అండ్ ఎం వర్క్ షాప్ నిర్మాణాలను చేపట్టనున్నారు. కాగా, ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేసేలా ఎయిర్‍పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ సంస్థలకు గడువు విధించింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభమై గడువులోగా పూర్తయితే వరంగల్ ప్రాంతం పారిశ్రామిక, పర్యాటక, రవాణా రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది