మసాజ్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు.. ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి అరెస్ట్ నరసరావుపేట, క్రైం (ఆంధ్రప్రభ) : నరసరావుపేట పట్టణంలో స్పా సెంటర్ల పేరుతో సాగుతున్న కార్యకలాపాలపై పోలీసులు దృష్టి సారించారు. మసాజ్ సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ఓ స్పా సెంటర్‌పై గురువారం సాయంత్రం దాడి చేయగా.. అక్కడ అనుమానాస్పద పరిస్థితులు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో స్పా సెంటర్‌పై దాడి చేసిన పోలీసులు.. మసాజ్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు గుర్తించారు. సెంటర్‌లో ఉన్న కొంత సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక గుంటూరుకు చెందిన స్వామి అనే వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో అతడు అక్కడ లేకపోవడంతో పరారీలో ఉన్నట్లు తెలిపారు. స్వామి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. అతడు పట్టుబడితే ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నరసరావుపేటలో మరో రెండు ప్రాంతాల్లో కూడా స్పా సెంటర్ల పేరుతో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందిందని డీఎస్పీ తెలిపారు. త్వరలోనే ఆయా ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. స్పా సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు