Kaizer News

Vaibhav Sooryavanshi | నేను వికెట్లు తీస్తానని కెప

Vaibhav Sooryavanshi | నేను వికెట్లు తీస్తానని కెప్టెన్‌కు తెలియదు.. ఆరోజు భయపడుతూనే బంతి ఇచ్చాడు..!

· Sports · ntnews.com

Vaibhav Sooryavanshi : క్రీజులోకి వస్తూనే బౌలర్లపై ఎడాపెడా సిక్సర్లతో విరుచుకుపడే వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) బంతితోనూ ఆకట్టుకుంటున్నాడు. దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో ఈ కుర్రాడు తన ఆఫ్‌ స్పిన్‌ నైపుణ్యం చూపించాడు. విధ్వంసక ఆటకు కేరాఫైన పదిహేనేళ్ల వైభవ్.. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ జట్టుపై నాలుగు బంతుల్లోనే 2 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. తమ జట్టు సెమీస్ చేరడంలో కీలకమైన అతడు ‘నేనూ వికెట్లు తీయగలను అని మా కెప్టెన్ ఇషాన్‌ కిషన్‌కు తెలియదు. ‘ అని పేర్కొన్నాడీ యువ సంచలనం. జింబాబ్వే పర్యటనలో మెరిసిన వైభవ్ సూర్యవంశీ దేశవాళీలోనూ అదరగొడుతున్నాడు. ప్రతిసారి తన తుఫాన్ ఇన్నింగ్స్‌లతో వార్తల్లో నిలిచే వైభవ్ ఈసారి బంతితో మ్యాజిక్ చేశాడు. ఎడమ చేతివాటం స్పిన్నరైన అతడు.. నార్త్ ఈస్ట్ జోన్‌పై నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లతో ఔరా అనిపించాడు. బ్యాటుతో 8 పరుగులే చేసినా ఆ రెండు వికెట్లతో ఈస్ట్ జోన్ సెమీస్ చేరడంలో తనవంతు పాత్ర పోషించిన అతడు.. తాను బౌలింగ్ చేస్తాననే విషయం కెప్టెన్ ఇషాన్ కిషన్‌క తెలియదని చెప్పాడు. ‘నార్త్ ఈస్ట్ జోన్‌తో మ్యాచ్‌లో నాకు బంతి అప్పగించి రిస్క్ తీసుకున్నానని ఇషాన్ భయ్యా అనుకున్నాడు. అయితే.. నేను వికెట్లు తీయగలననే సంగతి అతడికి తెలియదు. మీరు బ్యాటర్లను అడిగితే తాము బౌలింగ్‌ను ఆస్వాదిస్తామని చెబుతారు. ఓ బ్యాటర్ బౌలింగ్ చేయడం, ఓ బౌలర్ బ్యాటింగ్ చేయడం నిజంగా భలే అనిపిస్తుంది. ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లు వికెట్ ఇవ్వడం లేదు. దాంతో.. నాకో రెండు మూడు ఓవర్లు బౌలింగ్ ఇవ్వాలని ఇషాన్‌ను కోరా. ఒకవేళ ఐదు వికెట్లు తీసినా సరే నాకు రెండు మూడుకు మించి ఓవర్లు ఇవ్వరని నాకు తెలుసు. అందుకని.. సాధ్యమైనంత మెరుగ్గా బౌలింగ్‌ చేసేందుకు ప్రయత్నించా. బ్యాటింగ్‌లో విఫలమైన నేను.. బంతితో రాణించి జట్టు విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని వైభవ్ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌ 210 పరుగులతో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లింది. ఫైనల్ బెర్తు కోసం ఆగస్టు 30, ఆదివారం నార్త్ జోన్‌తో ఇషాన్ సేన తలపడనుంది

Original source: ntnews.com
Read more on Kaizer News