Kaizer News

Kurnool: వినాయక ఘాట్‌కు సరికొత్త శోభ: కమిషనర్ చల్ల

Kurnool: వినాయక ఘాట్‌కు సరికొత్త శోభ: కమిషనర్ చల్లా ఓబులేసు!

· State - Telangana · hmtvlive.com

కర్నూలు: నగరంలోని వినాయక ఘాట్ వద్ద చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి, స్వచ్ఛత పనులతో ఘాట్‌కు సరికొత్త శోభ సంతరించుకుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. ఆదివారం వినాయక ఘాట్‌ను కమిషనర్ సందర్శించి, ఇటీవల పూర్తి చేసిన సీసీ బండ్, మెట్లు, డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వినాయక ఘాట్ నిమజ్జన సమయంలోనే కాకుండా నిత్యం పరిశుభ్రంగా, స్వచ్ఛంగా, ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గత మూడు నెలల్లో జేసీబీలతో చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు పలుమార్లు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టామన్నారు. ఘాట్ పరిసరాల పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు ముగ్గురు సిబ్బందికి ప్రత్యేకంగా విధులు కేటాయించామని, వారు ఘాట్‌ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కేసీ కెనాల్‌లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. కేసీ కెనాల్‌లో చెత్త వేయకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు రెండు చెత్త సేకరణ ట్రాలీలను అందుబాటులో ఉంచామన్నారు. ఇటీవల కేసీ కెనాల్‌లో పేరుకుపోయిన గుర్రపుడెక్క మొక్కలను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ చర్యల ఫలితంగా ప్రస్తుతం వినాయక ఘాట్ పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తోందన్నారు. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని ఘాట్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా సీసీ రహదారి, మెట్లు, బండ్, రాతి నిర్మాణాలు, డ్రెయిన్, ఫెన్సింగ్ వంటి పనులను చేపట్టామన్నారు. దీంతో ఘాట్ నూతన శోభను సంతరించుకుందన్నారు. త్వరలోనే ఘాట్‌కు రంగులు వేసి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఫరూక్, శివశంకర్, తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News