వ్యాపార విజయానికి ఆర్థిక నిర్వహణ కీలకం: కలెక్టర్ లక్ష్మీశ ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ ‘ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. మహిళలు వ్యాపారాలను ప్రారంభించడంతోపాటు వాటిని విజయవంతంగా నిర్వహించేందుకు ఆర్థిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం ముఖ్యమన్నారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ విజయవాడ అధ్యాయం సహకారంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు శనివారం ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా సాధికారతలో ఆర్థిక అక్షరాస్యత పోషించే కీలక పాత్రను ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ విజయవాడ అధ్యాయం అధ్యక్షురాలు సుప్రియ మల్లినేని సమక్షంలో సంస్థ ఖజానాదారు సీఏ తుల్జా భవానీ వివరించారు. ఉద్యమ్ నమోదు, ఆదాయపు పన్ను, జీఎస్టీ, వ్యాపారానికి సంబంధించిన ఇతర చట్టపరమైన అంశాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు, రుణ సదుపాయాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వ్యాపారాలను మరింత విజయవంతంగా విస్తరించుకోవచ్చని వివరించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం, ఆదాయాన్ని పెంచుకోవడం ఎంత ముఖ్యమో.. వచ్చిన ఆదాయాన్ని సమర్థంగా నిర్వహించడం, ఖర్చులను నియంత్రించడం, పొదుపు చేయడం, భవిష్యత్ అవసరాలకు ప్రణాళిక రూపొందించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ఆర్థిక అక్షరాస్యత కలిగిన మహిళలు తమ వ్యాపారాల్లో లాభనష్టాలను అంచనా వేసుకుని సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారని తెలిపారు. ఆర్థికంగా అవగాహన కలిగిన మహిళలు కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, వ్యాపార నిర్ణయాల్లో మరింత ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగలుగుతారని పేర్కొన్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు కుటుంబ స్థిరత్వం, పిల్లల భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళా వ్యాపారవేత్తలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి. నాంచారరావు, రైజ్ మేనేజర్ బి. తేజస్విని తదితరులు పాల్గొన్నారు