నీళ్లివ్వండి.. లేదా మమ్మల్ని చంపండి.. అంటూ అన్నదాతల ఆవేదన శ్రీశైలం కోసం భూములిచ్చాం.. ఇప్పుడు సాగునీటి కోసం కన్నీళ్లా? నందికొట్కూర్, ఆంధ్రప్రభ: కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నందికొట్కూర్ నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద రైతులు సోమవారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఏకంగా కేసీ కెనాల్‌లోకి దిగి మెడకు ఉరితాళ్లు వేసుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. మాజీ జెడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి, మాజీ సర్పంచ్ శేషన్న, సిరిగిరి చంద్రారెడ్డి, నాగసేనారెడ్డి, పులేంద్ర నాయుడు తదితర రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మమ్మల్ని చంపండి.. లేదా నీళ్లు ఇవ్వండి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కళ్లముందే పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ పొలాలను త్యాగం చేసిన తమకే ఇప్పుడు సాగునీటి కోసం అల్లాడే పరిస్థితి వచ్చిందని రైతులు వాపోయారు. మరోవైపు ముచ్చుమర్రి ప్రాంతం నుంచి శీతల పానీయాల సంస్థకు భారీ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారని, తాము సాగునీటి కోసం కన్నీరు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి వెంటనే కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని, లేకపోతే ఇదే కాలువలో ఉరితాళ్లతో ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు