Kaizer News

H-1B visa fee | హెచ్‌-1బీ వీసా ఫీజు విష‌యంలో డొనాల

H-1B visa fee | హెచ్‌-1బీ వీసా ఫీజు విష‌యంలో డొనాల్డ్ ట్రంప్ మరింత‌ క‌ఠిన వైఖ‌రి..!

· National - India · ntnews.com

H-1B visa fee : హెచ్‌-1బీ (H-1B) వీసా దరఖాస్తులపై విధించిన లక్ష డాలర్ల ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ వీసాల ద్వారా విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థల నుంచి మరో ఏడాదిపాటు ఫీజు వసూలు చేసేలా ఆదేశాలు ఇచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకాలు చేశారు. సాధారణంగా ఈ వీసా దరఖాస్తుల కోసం అయ్యే ఖర్చును కంపెనీలు భరిస్తాయి. గతంలో ఇందుకోసం 2 వేల నుంచి 5 వేల డాలర్ల వరకు ఖర్చు కాగా.. గత ఏడాది సెప్టెంబరులో ఈ వీసా ఫీజును ట్రంప్‌ సర్కార్‌ ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసింది. ఆ నిబంధన తీసుకువచ్చి ఏడాది సమయం పూర్తవుతున్న సమయంలో ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో 12 నెలలపాటు ఈ పెంపును పొడిగించింది. 2025లో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఐటీ సేవలను అవుట్‌సోర్సింగ్ ఇస్తున్న కంపెనీల హెచ్-1బీ రిజిస్ట్రేషన్లలో 92 శాతం తగ్గుదల నమోదైందని అమెరికా ప్రభుత్వం పేర్కొన్న‌ది. దాంతో అమెరికన్ కార్మికులు, గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపింది. అత్యంత నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే కంపెనీలు నియమించుకునేలా చూడటం తమ ప్రధాన ఉద్దేశమని ట్రంప్ సర్కార్ చెబుతూ వ‌స్తున్న‌ది. అమెరికా హెచ్-1బీ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్న విదేశీయుల్లో భారతీయులు ముందువరుసలో ఉన్నారు. అమెరికాలో విద్యార్థి వీసాలపై ఉండి హెచ్‌-1బీ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఈ ఫీజు వర్తించదు. అమెరికా విడిచి వెళ్లకుండా ఇప్పటికే ఉన్న వీసాల స్టేటస్‌ను మార్చుకునేందుకు వచ్చిన దరఖాస్తులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అయితే బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లక్ష డాలర్ల రుసుమును అమెరికాలోని 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌ బోస్టన్‌ కోర్టులో సవాలు చేయగా.. ఆ ఫీజు చట్టవిరుద్ధమని తీర్పు వచ్చింది. అయితే ఈ అంశం ఇతర ఫెడరల్‌ కోర్టుల్లో విచారణ దశలో ఉంది. ఈ ఫీజుపై న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ లక్ష డాలర్ల ఫీజును మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ట్రంప్ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేయడం గమనించ‌వ‌ల‌సిన విష‌యం

Original source: ntnews.com
Read more on Kaizer News