ఒ కప్పుడు పిల్లలతో సందడిగా తిరిగిన ఇళ్లే అవి. ప్రతి పండుగ, ప్రతి వేడుకలో సంతోషం, కేరింతలతో నిండినవే. కానీ నేడు అవే ఇళ్లు నిశ్శబ్దానికి వేదికలుగా మారుతున్నాయి. పెద్ద కుటుంబాలకు పేరుగాంచిన కేరళలో ఇప్పుడు జనాభా నిర్మాణం వేగంగా మారుతోంది. పిల్లల సంఖ్య తగ్గుతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. యువత ఉద్యోగాలు, చదువుల కోసం ఇతర ప్రాంతాలకు, విదేశాలకు వెళ్తుండటంతో వృద్ధులు మాత్రమే ఇళ్లలో మిగిలిపోతున్నారు. అయితే వీరి సంరక్షణ ఇపుడు అక్కడి ప్రభుత్వానికి కొత్త సవాలుగా మారుతోంది. ‘వృద్ధుల సంరక్షణ’ ఎలా ఉండాలి? కుటుంబమే చూసుకోవాలా? లేక ప్రభుత్వం, సమాజం కూడా బాధ్యత తీసుకోవాలా? అనే ప్రశ్నలు కేరళను సందిగ్ధావస్థలో పడేస్తున్నాయి. గత రెండున్నర దశాబ్దాల నుంచి భారీ స్థాయిలో ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకి, గల్ఫ్ దేశాలకు తరలిపోవడం వల్ల రాష్ట్రంలో వృద్ధుల జనాభా ఊహించని రీతిలో పెరిగిపోవడానికి కారణమైపోయింది. మారుతున్న జనాభా చిత్రం ఆయుర్దాయం పెరగడం, జననాల రేటు తగ్గడం వంటి జనాభా మార్పులు కేరళ సామాజిక నిర్మాణాన్ని మార్చుతున్నాయి. యువత సంఖ్యతో పోలిస్తే వృద్ధుల వాటా పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం, ఆర్థిక భద్రత, నివాసం, రోజువారీ సంరక్షణ వంటి అంశాలు మరింత కీలకంగా మారుతున్నాయి. అంటే.. కేరళ ఇప్పుడు కేవలం జనాభా పెరుగుతున్న రాష్ట్రం కాదు.. వృద్ధాప్యం పెరుగుతున్న రాష్ట్రంగా కూడా మారుతోంది. ఉద్యోగాల కోసం విదేశాలకు.. ఇంతకుముందు తల్లిదండ్రులు, పిల్లలు, తాతలు, అమ్మమ్మలు కలిసి ఉండే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది. ఇంట్లోనే పెద్దలను చూసుకునేవారు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఉద్యోగాల కోసం పిల్లలు ఇతర నగరాల్లో లేదా విదేశాల్లో స్థిరపడుతున్నారు. చిన్న కుటుంబాలు పెరుగుతున్నాయి. దీంతో పెద్దవారు ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అప్పుడు ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే.. ‘పిల్లలు దూరంగా ఉంటే.. వృద్ధులను ఎవరు చూసుకోవాలి?’’ అనేది. యూరప్ ఏం చెబుతోంది? యూరప్‌లోని అనేక దేశాలు వృద్ధుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితిని చాలాకాలంగా ఎదుర్కొంటున్నాయి. అక్కడ వృద్ధుల సంరక్షణను కుటుంబ బాధ్యతగా మాత్రమే కాకుండా సామాజిక, ఆరోగ్య, సంక్షేమ వ్యవస్థలతో అనుసంధానించి చూడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటి వద్దే సంరక్షణ, ఆరోగ్య సేవలు, దీర్ఘకాలిక సంరక్షణ, సామాజిక భద్రత వంటి అంశాలకు ్రపాధాన్యం ఇస్తున్నారు. అంతేకాకుండా వృద్ధుల హక్కులు, భద్రతకు కొన్ని సందర్భాల్లో చట్టపరమైన రక్షణ కూడా అవసరం. కానీ చట్టం ఉండటం మాత్రమే సరిపోదు. దాన్ని అమలు చేసే వ్యవస్థ కూడా బలంగా ఉండాలి. అందుకే కేరళ కూడా తన అవసరాలకు తగ్గట్టుగా అలాంటి విధానాల నుంచి ఏమి నేర్చుకోవచ్చనే దానిపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం జపాన్, నార్వే దేశాల్లో అమలులో ఉన్న వృద్ధుల సంరక్షణ విధానాలను పరిశీలిస్తోంది. అయితే కేరళలో కనిపిస్తున్న జనాభా మార్పులు ఆ రాష్ట్రానికే పరిమితం కావు. దేశంలో ఆయుర్దాయం పెరుగుతూ, కుటుంబ నిర్మాణాలు మారుతున్న కొద్దీ మరిన్ని ప్రాంతాల్లోనూ వృద్ధుల సంరక్షణపై ఇదే తరహా ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే వృద్ధా΄్యాన్ని ‘కుటుంబం చూసుకోవాల్సిన వ్యక్తిగత విషయం’గా మా