Tollywood : తెలుగు సినిమాలో కొత్త ఒరవడి కొనసాగుతోంది. గతంలో ఆడపాదడపా విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు మాత్రమే పరిమితమై.. అవమానాలు చవిచూసిన తెలంగాణ భాష (Telangana Dialect)కు అందలం దక్కుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ జనం తెగ పాడుకున్న జానపదాల (Telangana Folk Songs)కు ఈమధ్య కాలంలో ప్రాధాన్యం పెరుగుతోంది. సినిమా టైటిళ్లే కాదు.. ప్రత్యేక పాటగా ఈ ప్రాంత యాసను కళ్లకు కట్టే ఫోక్ సాంగ్స్‌కు పెద్దపెద్ద హీరోలు సైతం జోష్‌గా స్టెప్పులేస్తున్నారు. ‘రాములో రాముల’.. ‘సారంగదరియా’కు విశేష ఆదరణ లభించగా.. నేచురల్ స్టార్ నాని ‘ప్యారడైజ్’ (Paradise) చిత్రంలోని ‘యెష నాగుల కట్ట’ లిరికల్ వీడియో సాంగ్ విడుదలతో మరోమారూ మన జానపదం థియేటర్లో పూనకాలు తెప్పించనుంది. తెలంగాణ సంప్రదాయాలు, ఇక్కడి పల్లెపదాలకు టాలీవుడ్ జై కొడుతోంది. మన ప్రాంతంలోని ఆచార వ్యవహారాలకు భావోద్వేగాలు జోడించిన వేణు ఎల్డండి ‘బలగం’ సినిమా ఎంతపెద్ద హిట్టో తెలిసిందే. ఇప్పుడు వేణు ఎల్లమ్మతో వస్తుండగా.. తెలంగాణ ఈ ప్రాంత చరిత్రతో తెరకెక్కిన ‘రాజన్న’, ‘ఛాంపియన్’ వంటి చిత్రాలు ఆదరణ పొందగా.. తెలంగాణ యాసతో వరసగా హిట్స్ అందుకున్నారు విజయ్ దేవరకొండ, సిద్దూ జొన్నలగడ్డ. ఇదే ఒరవడికి కొనసాగింపుగా.. మన జానపదాలు ఈమధ్య వెండితెరపై ప్రభంజనం సృష్టిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు మాత్రమే పాడుకునే, విని తరించే హిట్ జానపదాలను ఏరికోరి సినిమాలో పెడుతున్నారు దర్శకులు. కొన్నింటికి స్వరకర్తలు కొత్త బాణీలు కడుతుండగా.. హీరోలతో కొరియోగ్రాఫర్లు మాస్ స్టెప్పులేయిస్తున్నారు. ‘లవ్ స్టోరీ’ చిత్రంలో ‘సారంగదరియా’ సాంగ్ బ్లాక్‌బస్టరైంది. నాగచైతన్య హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించి ఈ సినిమాలోని ఈ పాటకు సాయి పల్లవి నృత్యం ప్లస్ అయింది. ఇక ‘అల వైకుంఠపురం’లో మంగ్లీ పాడిన రాములో రాముల పాట ఎంత హిట్టో తెలిసిందే. తెలంగాణ పదాలను, యాసను మేళవిస్తూ కాసర్య శ్యామ్ రాసిన ఈ పాటకు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే స్పెప్పులు ఇరగదీశారనుకో. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్‌లో 79 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో ‘నర్సపల్సి గండిలోన గంగధారి ఆడి నెమలి ఆటలకు గంగధారి’ అనే జానపద లైన్స్ తీసుకున్నారు. ఈ సాంగ్‌కు చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్ డ్యాన్స్ కుమ్మేశారు. రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాలోని ‘గున్నా గున్నా మామిడి’ సాంగ్ ఎంత పాపులరో తెలిసిందే. ప్రస్తుతం. నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాలో ‘యెష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల’ పాటను తీసుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదలైంది. నాని, కీర్తి సురేశ్‌లు ఈ సాంగ్‌కు వేసిన మాస్ స్పెప్టులు.. ఈ ఫోక్ సాంగ్‌ను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లడం ఖాయం. ఒకప్పుడు టేపు రికార్డర్‌లో విన్న ఈ పాటలు.. యూట్యూబ్ ఛానెళ్ల పుణ్యమాని ఈతరానికి కూడా చేరువయ్యాయి. కథను బట్టి.. ఈ ప్రాంత విశిష్టతను చాటుతున్న ఈ ఫోక్ సాంగ్స్ ట్రెండ్ సినిమా హిట్ ఫార్ములాలో భాగమైపోయింది