చౌటుప్పల్, ఆంధ్రప్రభ: సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదగిరిగుట్టలో నిర్వహించనున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర మూడో మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగొని గాలయ్య, పల్లె శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం చౌటుప్పల్‌లో మహాసభల నిర్వహణ కోసం ఉద్యమనిధి, విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బచ్చనగొని గాలయ్య, పల్లె శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 8న యాదగిరిగుట్టలో భారీ యువజన కవాతు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ప్రతినిధుల సభలు జరుగుతాయని పేర్కొన్నారు. పాలకుల విధానాలపై పోరాడేందుకు యువత పెద్ద సంఖ్యలో మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక విలువల పరిరక్షణతో పాటు విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధన కోసం ఏఐవైఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. యువత సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్, చౌటుప్పల్ మండల అధ్యక్షుడు గుండెబోయిన భాస్కర్, నాయకులు బద్దుల సుధాకర్, టంగుటూరు రాములు, నీళ్ల భిక్షపతి, సుర్వి నర్సింహా, సింగపంగ రమేష్, గడ్డం యాదగిరి తదితరులు పాల్గొన్నారు