చౌటుప్పల్, ఆంధ్రప్రభ: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను చూసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం స్టేజ్ నుంచి సర్వీస్ రోడ్డు వరకు ఆదివారం ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే మార్గంలో వెళ్తున్న కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పరిస్థితిని గమనించి వెంటనే తన వాహనం నుంచి దిగారు. ట్రాఫిక్ పోలీసు సిబ్బందితో మాట్లాడి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వయంగా రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో వాహనాల రాకపోకలు వేగంగా సాగాయి. ప్రజల సమస్యపై వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్యే చొరవను స్థానికులు, వాహనదారులు అభినందించారు