రెంటచింతల (ఆంధ్రప్రభ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెంటచింతలలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లపై కన్నేసి గుట్టుచప్పుడు కాకుండా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా మండలంలోని ఆరోగ్యపురం కాలనీలో జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఆరోగ్యపురం కాలనీకి చెందిన గంజి బాలరెడ్డి తెలంగాణలోని పెదవూర సమీపంలో నర్సరీ వ్యాపారం నిర్వహిస్తూ, అక్కడే కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. గురువారం ఆయన రెంటచింతలకు రాగా.. ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉండటం చూసి ఖంగుతిన్నారు. లోపలికి వెళ్లి చూడగా దొంగలు బీభత్సం సృష్టించినట్లు స్పష్టమైంది. ఇంట్లోని రెండు బీరువాలను పగులగొట్టిన దుండగులు…. అందులో భద్రపరిచిన 30గ్రాముల బంగారు ఆభరణాలు, అరకిలో (500 గ్రాములు) వెండి వస్తువులతో పాటు రూ.1,00,000 లకు పైగా నగదును తీసుకెళ్లారు. వెంటనే తేరుకున్న బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చోరీ జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు