తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వ్యంగ్యాస్ర్తాలు పేలుతున్నాయి. ఒక అంశంపై ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి మిత్రులతో మాటామంతిలో విన్న కొన్ని పదాలు ఆశ్చర్యం కలిగించాయి. ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇంతటి చులకనభావంతో కూడిన పదాలు వాడుతున్నరా అని ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ వ్యంగ్యంలో రాజకీయ కోణం లేదు. ఆ పదాలు ఎందుకు పుట్టాయన్నదే అసలు చర్చ. ప్రభుత్వ నిర్ణయాల్లో స్పష్టత ఉన్నదా? ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలకు మధ్య పొంతన ఉన్నదా? ప్రజలకు ఇచ్చిన హామీల అమలు సంగతేంది? అనే ప్రశ్నలే ఇప్పుడు చర్చకు కేంద్రంగా మారుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ విస్తృతమైన హామీలతో ప్రజల ముందుకు వచ్చింది. స్థూలంగా వాటిని ఆరు గ్యారెంటీలుగా ప్రకటించుకున్నది. ఒక్కొక్క గ్యారంటీ అనేక అంశాలతో కలిపి 420 హామీలుగా ఇచ్చింది. ఇవి మాత్రమే కాదు. యువత, రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రత్యేక డిక్లరేషన్లు కూడా ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మబలికింది. కల్యాణలక్ష్మి పథకంలో లక్ష రూపాయలతోపాటు తులం బంగారం కూడా ఇస్తామని తెలిపింది. కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు భృతి ఇస్తామని తెలిపింది. తమ పార్టీకి పాలనలో అపారమైన అనుభవం ఉన్నదని, అన్ని విషయాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఈ హామీలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు మాట మార్చారు. హామీలు అటకెక్కాయి. ప్రజలకు ఇచ్చిన మాటకు, పాలనా వాస్తవాలకు మధ్య పొంతనలేదు. రాజకీయ నాయకుడికి మాటలే పెద్ద ఆయుధం. కానీ ఆ మాటలు అమలులో డొల్లబారి కల్లలైనప్పుడు ప్రజల నుంచి తీవ్రమైన నిరసనలను ఎదుర్కోవలసి వస్తుంది. రేవంత్‌రెడ్డి గతంలో ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తున్నాయి. అబద్ధాలు చెప్తేనే ప్రజలు ఓట్లు వేస్తారని, మోసం చేయడంలో తప్పు లేదని, అలవి కాని హామీలు ఇవ్వడం రాజకీయాల్లో సాధారణమని సీఎం బాహాటంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయ ఆలోచనా విధానానికి, ప్రజల పట్ల ఆయనకు గల చులకన భావానికి నిదర్శనం. ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయ ఆలోచనా విధానానికి ప్రతిబింబంగా ప్రజలు ఇప్పుడు గుర్తించారు. ప్రజల మీద ఆయనకు గల చులకన భావాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అవసరమైన ఆర్థిక ప్రణాళిక అప్పుడే సిద్ధంగా ఉన్నదా? లేక అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆర్థిక వాస్తవాలు, సాధ్యాసాధ్యాలు గుర్తొచ్చాయా? ప్రజలకు ఇచ్చిన మాటకు, పాలనా వాస్తవాలకు మధ్య ఏర్పడిన ఈ అంతరమే రాజకీయ విమర్శలకు ప్రధాన కారణంగా మారుతున్నది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ప్రజలను మభ్యపెట్టడానికి రాజకీయ వ్యూహంలో భాగమా? నిజంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన హామీలా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న నాయకత్వానిదే. ప్రజలు ప్ర