ప్రాకార మండపం నిర్మాణంతో ఆలయానికి కొత్త రూపు.. అభివృద్ధి పనులకు నిధుల మంజూరు కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొత్తమ్మ అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధి పనులకు రూ.4.52 కోట్ల నిధులు మంజూరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక కృషి ఫలితంగానే దేవాదాయ శాఖ నుంచి ఈ స్థాయిలో నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటికే కొత్తమ్మ తల్లి ఉత్సవాలను రాష్ట్రస్థాయి పండుగగా నిర్వహించడంలో వీరి కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ఆలయ ప్రాకార మండపం నిర్మాణంతో పాటు ఇతర మరమ్మతులు, అభివృద్ధి పనులకు మొత్తం రూ.5 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇందులో భాగంగా స్థానిక వాటా కింద రూ.48 లక్షలు జమ చేయగా, దేవాదాయ శాఖ సాధారణ మేలు నిధుల కమిటీ మిగిలిన రూ.4,52,00,000లను మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్రమోహన్ అమరావతి నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరైన అంచనాలకు సాంకేతిక అనుమతులు పొంది, ఈ-టెండర్ల విధానంలో పారదర్శకంగా పనులు ప్రారంభించాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. నిధులు మంజూరు కావడం పట్ల స్థానిక ప్రజలు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాకార మండపం నిర్మాణం పూర్తయితే భక్తులకు మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు