ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకే ఆకర్షితులై చేరికలు భూపాలపల్లి, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు క్యాంపు కార్యాలయంలో చిట్యాల మండలం రామచంద్రాపూర్ సర్పంచ్ గాజా హేమలత అశోక్, కైలాపూర్ సర్పంచ్ కోదారి ఓదెలుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తమ గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామానికి సమాన ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలుకుతూ ప్రజాసేవలో భాగస్వాములు కావాలని కోరారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు