ఎన్నికను బహిష్కరించిన నాయకులు.. రద్దు చేయకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరిక మహాదేవపూర్, ఆంధ్రప్రభ: కాళేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ కమిటీ ఎన్నిక ఆదివారం వివాదానికి దారితీసింది. పార్టీ నిబంధనలను పక్కనపెట్టి బీఆర్‌ఎస్‌కు చెందిన కార్యకర్తలను ఓటింగ్‌లో పాల్గొనేలా చేశారని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీనిని వ్యతిరేకిస్తూ సుమారు 60 మంది నాయకులు, కార్యకర్తలు ఎన్నికను బహిష్కరించారు. గ్రామశాఖ అధ్యక్ష పదవికి పలువురు అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోగా, ఎన్నిక సందర్భంగా ఇతర పార్టీకి చెందిన వ్యక్తులను తీసుకొచ్చి ఓటింగ్‌లో పాల్గొనే ప్రయత్నం జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది. పార్టీకి చెందిన అసలైన కార్యకర్తలను పక్కనపెట్టి ఇతర పార్టీల కార్యకర్తలతో కమిటీ ఏర్పాటు చేయడం సరికాదని బహిష్కరించిన నాయకులు పేర్కొన్నారు. ఎన్నికను వెంటనే రద్దు చేసి పార్టీ అధిష్ఠానం పర్యవేక్షణలో పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎన్నికను రద్దు చేయకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఎన్నికను బహిష్కరించిన వారిలో మాజీ అధ్యక్షుడు మంగాయి లక్ష్మణ్, గండెసిరి సత్యనారాయణ, సుంకర సీతయ్య, మెంగాని అశోక్, రేవల్లి మమతా నాగరాజు, కొండ శ్రీనివాస్, నబి రమేష్, సడవలి రాములు తదితరులు ఉన్నారు