కంటి చుక్కలతో కాంతిరేఖ అంధత్వానికి కొత్త వెలుగు! కంటి చూపుతో చంపేస్తానంటాడు ఒక తెలుగు సినిమాలో హీరో. అవును! కంటికి అంత పవర్ ఉంది. ఆ పవర్ అంతా ఆ కన్ను చూసే చూపులో ఉంది. అంతటి శక్తిమంతమైన చూపు... క్షీణిస్తే?! జీవితం అనుక్షణ దుర్భరం అవుతుంది. ఆ దుర్భర త్వాన్ని తొలగించి తిరిగి చూపును రప్పించే ‘చుక్కల మందు’ను శాస్త్ర పరిశోధకులు తాజాగా కనిపెట్టారు. ఎలుకలు, జెబ్రాఫిష్‌పై ఫలించిన ఆ ప్రయోగాలు ఇప్పుడు మానవుల మీద మొదలవుతున్న దశలో ఉన్నాయి. చూపు కోల్పోయిన ఎలుకలపై శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగం నిజంగా అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. కాంతికి స్పందించే ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని తయారుచేసి, దానిని కంటి చుక్కల మందు రూపంలో అందించినప్పుడు, చూపు లేని ఆ ఎలుకలు మళ్లీ వెలుగును గుర్తించటమే కాకుండా వెలుగుకు అనుగుణంగా స్పందించడం ప్రారంభించాయి! సాధారణంగా చూపు పునరుద్ధరణ కోసం సంక్లిష్టమైన జన్యు చికిత్సలు (జీన్ థెరపీ), కంటిలో ఆపరేషన్ చేసి ఇంప్లాంట్లు అమర్చడం లేదా ప్రత్యేకమైన లైటింగ్‌ను వాడటం వంటివి చేస్తుంటారు. కానీ ఎలాంటి సర్జరీలు లేదా చిప్‌ల అవసరం లేకుండా, కేవలం కంటి చుక్కల మందుతోనే చూపును తిరిగి తీసుకురావటం ఇది! రెండు రకాల మందుల మిశ్రమంతో శాస్త్రవేత్తలు కనిపెట్టిన దివ్యౌషధం వంటి ఈ చుక్కల మందు ఎలుకల్లో, జెబ్రాఫిష్‌లో చాలా బాగా పనిచేసింది. భవిష్యత్తులో దృష్టి లోపాలు, పూర్తి అంధత్వంతో బాధపడే మానవులకు కూడా చూపు తెప్పించే చికిత్సను అందించవచ్చనే ఆశను ఈ ప్రయోగం శాస్త్రవేత్తల్లో కలిగిస్తోంది. వెలుగును గుర్తించే శక్తి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ప్రజలు వయసు పైబడటం వల్ల వచ్చే ‘మాక్యులర్ డిజెనరేషన్’ (ఎ.ఎం.డి.), ‘రెటినైటిస్ పిగ్మెంటోసా’ (ఆర్.పి.) వంటి వ్యాధుల వల్ల చూపు కోల్పోతున్నారు. ఈ అంధత్వం కారణంగా వ్యక్తుల రోజువారీ జీవితం, స్వేచ్ఛ దెబ్బతినడమే కాకుండా, వైద్య ఖర్చులు, ఉత్పాదకత తగ్గడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ. 33,40,000 కోట్లకు పైగా భారం పడుతోంది. మన కంటిలోని రెటీనాలో ఉండే ‘ఫొటోరిసెప్టర్’ కణాలు కాంతిని గుర్తుపట్టి దాన్ని సంకేతాలుగా మారుస్తాయన్నది తెలిసిందే. అయితే ఎ.ఎం.డి., ఆర్.పి. వ్యాధులలో ఈ ఫొటోరిసెప్టర్ కణాలు నెమ్మదిగా క్షీణించి చనిపోతాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ ఫొటోరిసెప్టర్లు చనిపోయినప్పటికీ, కంటి లోపల ఉండే మిగిలిన నరాల వ్యవస్థ మాత్రం చాలా వరకు ఆరోగ్యంగానే పనిచేస్తూ ఉంటుంది! కానీ కాంతిని గ్రహించే ఫొటోరిసెప్టర్లు లేకపోవడం వల్ల, ఈ నరాలకు వెలుగు సంకేతాలు అందక మెదడుకు సమాచారం వెళ్లదు. అందుకే శాస్త్రవేత్తలు కంటిలో సజీవంగా ఉన్న ఈ మిగిలిన నరాల వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని, వాటికి మళ్లీ కాంతిని గుర్తించే శక్తిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జన్యు చికిత్సలు కేవలం కొద్దిమంది రోగులకు మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ రెటీనా పరికరాలు చాలా ఖరీదైనవి, సర్జరీ అవసరమైనవి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల ఈ చుక్కల మందు మంచి ఫలితాలు సాధించినప్పటికీ, అంధులకు సాధారణ కాంతిలో కూడా స్పష్టమైన దృష్టిని అందించడం ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగా