భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రైతులకు వరప్రదాయినిగా మారనుంది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ నుంచి మారెళ్లపాడు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ లిఫ్ట్ ద్వారా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలంలో 16,180 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ స్కీంలోని హెడ్ వర్క్స్‌కు రూ.25 కోట్లు, మెయిన్ కెనాళ్ల నిర్మాణానికి రూ.113.17 కోట్లు, భూసేకరణకు రూ.42.30 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా సీతారామ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ 9.850 కిలోమీటర్ వద్ద మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను చేపట్టింది. రూ.25 కోట్లతో పంప్‌హౌస్ నిర్మాణాన్ని మెఘా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టగా, పనులు దాదాపు పూర్తయ్యాయి. 1.80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు మోటర్ల ద్వారా 46 మీటర్ల ఎత్తు నుంచి 85 మీటర్ల ఎత్తు వరకు సుమారు 39 మీటర్ల మేర 180 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. పంప్‌హౌస్ నుంచి 2.4 కి.మీ. దూరంలో కొండ కింద డెలివరీ సిస్టర్న్‌ను నిర్మించారు. అక్కడి నుంచి కాలువల్లోకి నీరు చేరుతుంది. సిస్టర్న్ నుంచి 10.070 కి.మీ. మేర రెండు ప్రధాన కాలువలను నిర్మించాల్సి ఉంది. మెయిన్ కెనాళ్లతో పాటు చిన్న కాలువల నిర్మాణానికి ప్రభుత్వం రూ.113.17 కోట్లు కేటాయించింది. కుడి కాలువ పొడవు 9.650 కి.మీ. కాగా, దీని ద్వారా 11,915 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఎడమ కాలువ పొడవు 420 మీటర్లు. దీని ద్వారా తుమ్మల చెరువు నిండనుండగా, దాని కింద ఇప్పటికే ఉన్న 4,266 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మారెళ్లపాడు స్కీం ద్వారా తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు ప్రయోజనం చేకూరనుంది. అమెర్థా, అమ్మగారిపల్లి, అశ్వాపురం, చింతిర్యాల, నెల్లిపాక తదితర గ్రామాలతో పాటు తుమ్మల చెరువు కింద ఉన్న ఆయకట్టుకు భారీగా లాభం చేకూరనుంది. అమెర్థలో 1,877 ఎకరాలు, అమ్మగారిపల్లిలో 958, అశ్వాపురంలో 2,474, గొంది గూడెంలో 8, కేశవాపురంలో 23, కుమ్మరిగూడెంలో 90, నెల్లిపాకలో 4,281 ఎకరాలకు సాగునీరు అందనుంది. తుమ్మల చెరువు కింద 87 ఎకరాల కొత్త ఆయకట్టుకు కూడా నీరు అందుతుంది. ఇప్పటికే ఉన్న 4,266 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగనుంది. కాలువల నిర్మాణానికి 235 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. భూసేకరణ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రైతులతో చర్చించారు. నలుగురైదుగురు రైతులు ముందుగా పరిహారం చెల్లించిన తర్వాతే భూములు ఇస్తామని పట్టుబడుతుండగా, వారిని ఒప్పించేందుకు ఎమ్మెల్యేతో పాటు అధికారులు ప్రయత్నిస్తున్నారు. భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.42.30 కోట్లు కేటాయించింది. మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను మరో మూడు, నాలుగు రోజుల్లో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు సమాచారం. లిఫ్ట్ ప్రారంభంతో తొలిదశలో సుమారు 7 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. మెయిన్ కెనాళ్ల నిర్మాణ